: 'మహాత్మా గాంధీని హత్య చేసింది ఆరెస్సెస్సే' ఏ విచారణకైనా సిద్ధమంటూ క్వాష్ పిటిషన్ వెనక్కు తీసుకున్న రాహుల్ గాంధీ
మహాత్మా గాంధీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ యేనని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ, తన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానని, ఏ విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేస్తూ, సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ను నేడు ఉపసంహరించుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వేసిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారణను ఎదుర్కొంటారని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. మహారాష్ట్రలోని థానే జిల్లా, భీవండీ కోర్టులో ఈ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. తన క్లయింటు తరఫున దాఖలైన క్వాష్ పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు కపిల్ సిబల్ కోర్టుకు తెలిపిన తరువాత, ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు మినహాయింపునివ్వాలని కోరగా, అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కేసు విచారణ నిమిత్తం ఆయన కింది కోర్టుకు వెళ్లక తప్పదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.