: వేర్పాటు వాదులపై నరేంద్ర మోదీ ఉక్కుపాదం... విమాన టికెట్లు, హోటల్ సేవలు, సెక్యూరిటీపై నిషేధం!
కాశ్మీర్ లోయలో యువతను రెచ్చగొడుతూ, అశాంతికి కారణమవుతున్న వేర్పాటు వాదులపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలను విధించడం ద్వారా ఉక్కుపాదం మోపాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా వేర్పాటు వాదులను నిలువరించేందుకు వారిని గుర్తించి విమానం టికెట్ల నిరాకరణ, హోటల్, టాక్సీ సేవల రద్దు వంటి వాటిని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వేర్పాటు వాద నేతలైన సయ్యద్ అలీ షా జిలానీ, మీర్ వైజ్ ఫారూక్, యాసిన్ మాలిక్ వంటి వారు విదేశీ పర్యటనలు సైతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరిని కాశ్మీర్ లోని ఇళ్లకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా అల్లర్లను కొంతమేరకు నియంత్రించవచ్చన్న ఆలోచనతో మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వారికి ఇస్తున్న సెక్యూరిటీని తొలగించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం వేర్పాటు వాదుల రక్షణ కోసం 950 మంది పోలీసులు పనిచేస్తున్నారు. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది.