: రేపు పశ్చిమబెంగాల్ స్తంభించదు: మమతాబెనర్జీ
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ కేంద్ర కార్మిక సంఘాలు రేపు నిర్వహించతలపెట్టిన బంద్ పట్ల పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆమె ట్విట్టర్ ద్వారా ఈ అంశంపై స్పందిస్తూ.. జనజీవనానికి అంతరాయం కలిగిస్తే ఊరుకోబోమని పేర్కొన్నారు. రేపు తమ రాష్ట్రం స్తంభించదని ఆమె అన్నారు. స్కూళ్లు, కాలేజీలు, దుకాణాలు, కార్యాలయాలు, కర్మాగారాలు రేపు తెరుచుకునే ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థ సేవలు కూడా ప్రజలకి అందుతాయని మమతాబెనర్జీ పేర్కొన్నారు. ఎవరైనా అడ్డుతగిలితే తమ సర్కారు చర్యలు తీసుకుంటుందని అన్నారు. అంతేకాదు, రేపటి బంద్‌లో తమ రాష్ట్రంలో వాహనాలు, దుకాణాలు ధ్వంసమైతే వాటికి తాము పరిహారం ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. రేపటి బంద్‌లో దాదాపు 15 కోట్ల మంది కార్మికులు పాల్గొననున్నారు.