: రేపు అతిపెద్ద ట్రేడ్ యూనియన్ సమ్మె... ఇబ్బందులు తప్పవు!
కిందిస్థాయి సిబ్బంది వేతనాలను రెట్టింపు చేయాలని, ప్రైవేటు రంగంలో విదేశీ పెట్టుబడులు కూడదని, బ్యాంకులను విలీనం చేసే ఆలోచనలు వద్దని డిమాండ్ చేస్తూ, వివిధ రంగాల్లోని దాదాపు 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు రేపు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకులు, అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక ఉద్యోగ సంఘాలు సైతం సమ్మెకు మద్దతిస్తుండటంతో ప్రజా రవాణాకు అంతరాయాలు కలగనున్నాయి. బ్యాంకు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ వంటి అత్యవసర ఉత్పత్తుల రవాణా ఆగుతుంది. ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ప్రొడక్షన్ నిలిచిపోనుంది. ప్రభుత్వ రంగ కోల్ ఇండియా కార్మికులు సమ్మెకు దిగనుండటంతో ఒకరోజు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. నిన్నటి నుంచి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ప్రతినిధులతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరిగినప్పటికీ, అవి ఫలించలేదు. బీమా, రక్షణ రంగాల్లో విదేశీ పెట్టుబడు పరిమితులు సడలించడంపై ఉద్యోగ సంఘాలు తమ పట్టును వీడకపోవడంతో సమ్మె అనివార్యమైంది. ఎటొచ్చీ రైల్వే యూనియన్లు సమ్మెకు దిగకపోవడం మాత్రం ఒకింత ఉపశమనం కలిగించే అంశమే.