: దాసరి గారూ... వైసీపీ వలలో పడకండి!: దర్శకరత్నకు రామానుజయ బహిరంగ లేఖ!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకు ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కొద్దిసేపటి క్రితం బహిరంగ లేఖ రాశారు. కాపు నేతలు వైసీపీ వలలో పడరాదంటూ ఆయన ఆ లేఖలో దర్శకరత్నకు సూచించారు. ఇటీవల కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హైదరాబాదు వచ్చిన సందర్భంగా దాసరి ఇంటిలో కాపు నేతలంతా భేటీ అయిన సంగతి తెలిసిందే. కాపులకు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు సర్కారు నాన్చుడు ధోరణితో ముందుకెళుతోందని ఆరోపించిన సదరు సమావేశం... ముద్రగడ చేపట్టే ఉద్యమానికి మద్దతు తెలిపినట్లు సమాచారం. ఈ సమావేశంపై రాష్ట్రంలోని కాపు జాతి మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తోందని రామానుజయ నేటి లేఖలో దాసరికి తెలిపారు. తమ ప్రభుత్వం ఇప్పటికే కాపుల సంక్షేమానికి రూ.885 కోట్లు ఖర్చు చేసిందని ఆయన చెప్పారు. కాపుల అభ్యున్నతికి కట్టుబడ్డ తమ ప్రభుత్వం పట్ల అనుమానం వ్యక్తం చేయడం సబబు కాదని, విపక్షం మాయలో పడి కాపు జాతికి అన్యాయం చేయొద్దని ఆయన దాసరికి సూచించారు.

  • Loading...

More Telugu News