: ఆస్ట్రేలియా కబడ్డీ కోచ్ గా మెదక్ జిల్లా వాసి


క్రీడల్లో తెలుగు తేజాలు సత్తా చాటుతున్నారు. మొన్నటి రియో ఒలింపిక్స్ లో రజత పతకంలో స్టార్ షట్లర్ పీవీ సింధు సత్తా చాటితే... ఒలింపిక్స్ చరిత్రలో బ్యాడ్మింటన్ క్రీడలో రెండు పతకాలు రావడానికి కారకుడయ్యాడంటూ పుల్లెల గోపీచంద్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా తెలుగు నేలకు చెందిన కబడ్డీ క్రీడలో తనదైన శైలిలో రాణించి ప్రస్తుతం ఆ క్రీడకు కోచ్ గా వ్యవహరిస్తున్న మెదక్ జిల్లా ఉత్తరపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి ... ఏకంగా ఆస్ట్రేలియా కబడ్డీ జట్టుకు కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాదులో వచ్చే నెలలో ప్రపంచ కప్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ ఈవెంట్ లో ఆస్ట్రేలియా జట్టు కూడా పాలుపంచుకుంటోంది. ఈ క్రమంలో తమ జట్టు సభ్యులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా శ్రీనివాసరెడ్డిని కోచ్ గా ఎంపిక చేసింది. ప్రొ కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గతంలో దక్షిణ కొరియా జట్టుకు కూడా అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించారు. ఆస్ట్రేలియా నుంచి బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీనివాసరెడ్డి త్వరలోనే ఆ దేశానికి బయలుదేరనున్నాడు.

  • Loading...

More Telugu News