: అయోధ్య సమీపంలోని హిందూ ఆలయ స్థలంలో మసీదు నిర్మించాలని నిర్ణయించిన ఆలయ ట్రస్ట్
అయోధ్య అల్లర్ల గురించి తెలియని వారుండరు. అక్కడ రామమందిరం, మసీదు నిర్మాణంపై చెలరేగిన గొడవలు దేశంలో కలకలం సృష్టించాయి. మతకల్లోలాలు సృష్టించాయి. ఇప్పుడు అయోధ్యకు సమీపంలోని ఓ హిందూ ఆలయం భూమిలో మసీదు నిర్మించాలని ఆలయ అధికారులు నిర్ణయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 300 ఏళ్లనాటి శిథిలమైన మసీదును హనుమంతగఢి ఆలయ భూమిలో నిర్మించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది. స్థానిక అలామ్‌గిరి మసీదు భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో అందులోకి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించారు. మసీదు స్థలం.. హనుమంత్‌గఢి ఆలయ స్వాధీనంలో ఉండడంతో శిథిలావస్థకు చేరిన మసీదును నిర్మించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. అంతేకాదు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును కూడా భరించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయానికి వచ్చింది. మసీదును ఆలయ సమీపంలో నిర్మిస్తున్నా అందరూ వచ్చి ప్రార్థనలు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అలామ్‌గిరి మసీదును 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హయాంలో నిర్మించారు. 1765లో నవాబ్ షుజావుద్దౌలా ఈ స్థలాన్ని హనుమంత్‌గఢి ఆలయానికి దానం చేశారు. నమాజుకు అడ్డంకులు సృష్టించకూడదనే ఒకేఒక్క షరతుతో నవాబ్ ఈ స్థలాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.