: ఆ కేసులో ఏమీ లేదు, వాళ్లతో ఏమీ కాదు!... ‘ఓటుకు నోటు’పై చంద్రబాబు!
తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చిన ఓటుకు నోటు కేసుపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఏమీ లేదని పేర్కొన్న ఆయన... ఈ కేసును ఆధారంగా చేసుకుని వైసీపీ తమను ఏమీ చేయలేదని కూడా వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత బెజవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓటుకు నోటు కేసు ప్రాతిపదికే చెల్లదని హైకోర్టు చెప్పినా... వైసీపీ నేతలు ఏసీబీ కోర్టుకు వెళ్లడంలో అర్థం లేదు. ఇందులో వైసీపీ ఊరికే అల్లరి చేస్తోంది. ఈ కేసులో ఏమీ లేదు. వాళ్ల వల్ల ఏమీ కాదు. పైగా ఇలాంటి కేసుల వల్ల వాళ్లకే చెడ్డపేరు వస్తుంది. మనం పనులు చేస్తుంటాం. వాళ్లు కేసులు వేస్తుంటారు. మనం రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం. వాళ్లు మనల్ని వెనక్కు ఎలా లాగాలా అని నిరంతరం ప్రయత్నిస్తున్నారు. వరుస కేసులతో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలన్నదే వారి లక్ష్యం. అయినా వాళ్ల వల్ల ఏమీ కాదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.