: మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. నాలుగో వన్డేను గెలుచుకోవడం ద్వారా 3-1 తేడాతో విజయం సాధించిన ఆసీస్ సిరీస్ ను సొంతం చేసుకుంది. దంబుల్లాలో జరిగిన నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 212 పరుగులకు ఆలౌట్ అయింది. లంకేయుల్లో ఓపెనర్ డిసిల్వా (76), కెప్టెన్ మాథ్యూస్ (34) రాణించగా, బౌలర్ పతిరన (24) ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ వార్నర్ (19) తొందరగా అవుటైనప్పటికీ, ఆరోన్ ఫించ్ కేవలం 18 బంతుల్లోనే 304 స్ట్రయిక్ రేట్ తో 55 పరుగులు చేసి లంక బౌలర్లను ఉతికి ఆరేశాడు. అనంతరం మిగిలిన కార్యాన్ని జార్జ్ బెయిలీ (90) హెడ్ (40) పూర్తి చేయగా, చివర్లో వేడ్ (8) వచ్చి విన్నింగ్ షాట్ తో వన్డేకు ముగింపు పలికాడు. దీంతో కేవలం 31 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 217 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా శ్రీలంక పతనాన్ని శాసించిన జేమ్స్ హేస్టింగ్స్ నిలిచాడు. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆసీస్ సిరీస్ ను సొంతం చేసుకుంది.