: టికెట్ లేకుండా క్రికెట్ స్టేడియంలోకి ప్రవేశించాలనుకున్న అభిమానులపై బాష్పవాయు ప్రయోగం
దంబుల్లా స్టేడియంలోకి టికెట్లు లేకుండా లోపలికి వెళ్లేందుకు యత్నించిన క్రికెట్ అభిమానులపై శ్రీలంక పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు జరిగిన మ్యాచ్ ను చూసేందుకని వారు విఫలయత్నం చేశారు. ఈ స్టేడియం కెపాసిటీ 18,000. ఈ మ్యాచ్ నిమిత్తం అమ్మకానికి పెట్టిన మొత్తం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. దీంతో, టికెట్లు లేని అభిమానులు, ప్రేక్షకులు అసహనంతో అక్కడి రోడ్డుపై బైఠాయించి, ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో వారిపై బాష్పవాయువు ప్రయోగం తప్పలేదు. కాగా, మూడు రోజుల క్రితం జరిగిన మ్యాచ్ కు టికెట్లు దొరకకపోవడంతో అభిమానులు నానాయాగీ చేశారు. బారికేడ్లను ధ్వంసం చేసి స్టేడియంలోకి ప్రవేశించారు.