: నా కల ఫలించింది..ఇక నిశ్చింతగా చనిపోతా: సీఎం మమతా బెనర్జీ


టాటా మోటార్స్ కు సింగూరులో కేటాయించిన 1000 ఎకరాల భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు వెలువడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ,‘సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎంతగానో ఎదురుచూశా. ఇక నిశ్చింతగా చనిపోతా. సుప్రీంకోర్టు తీర్పు నా చిరకాల కల. సింగూర్ ప్రజలకు న్యాయం జరగాలని ఎంతగానో కోరుకున్నా. నా కల ఫలించింది. రైతుల భూములు తిరిగి వారికే ఇవ్వాలంటూ తీర్పు నిచ్చింది. తీర్పు కోసం పదేళ్లుగా ఎదురుచూశాము. ఈ తీర్పు రైతుల విజయం. ఈ విజయాన్ని ప్రతిఒక్కరూ దుర్గాపూజ ఉత్సవాన్ని గుర్తుకు తెచ్చేలా జరుపుకుంటారని భావిస్తున్నాను’ అంటూ ఉద్విగ్నంగా అన్నారు. కాగా, నానో కార్ల తయారీ నిమిత్తం టాటా మోటార్స్ సంస్థకు 1000 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు నాటి సీపీఎం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ 2006లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత మమతా బెనర్జీ ఆందోళనలకు దిగారు. ఈ ఏడాది మేలో అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తుది తీర్పును ఈరోజు వెల్లడించింది. భూములను పది వారాల్లోగా సంబంధిత రైతులకు అప్పగించాలని ఆదేశించింది. కాగా, ఈ ఆదేశాలను ఏ విధంగా అమలు చేయాలనే విషయమై మమతాబెనర్జీ రేపు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

  • Loading...

More Telugu News