: ఎంపీ ఇంటికి నిప్పంటించిన ఆందోళనకారులు.. కశ్మీర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం
హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తరువాత జమ్ముకశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లు కాస్త చల్లారడంతో అక్కడ విధించిన కర్ఫ్యూ ఆంక్షలను అధికారులు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆంక్షలు ఎత్తివేసిన కొన్ని గంటల్లోనే అక్కడ మళ్లీ తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఆ రాష్ట్ర అధికార పీడీపీకి చెందిన పార్లమెంటు సభ్యుడైన నజీర్ లావే ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. కుల్గామ్‌లోని చావల్గామ్ గ్రామంలో ఎంపీ ఇల్లుని తగులబెట్టడం కలకలం రేపింది. నజీర్ లావే ఇంటికి నిప్పంటించే ముందు ఆయన గార్డు రూమ్‌కు కూడా ఆందోళనకారులు నిప్పంటించారు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఎవ్వరికీ ప్రమాదం జరగలేదు. ఆందోళనకారులు చేసిన చర్యతో కుల్గామ్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.