: చైనా, పాకిస్థాన్ మధ్య భారీ ఆయుధ డీల్!
అమెరికాతో ఆయుధ ఒప్పందాలకు షరతులు అడ్డుపడడంతో పాకిస్థాన్ ఇటీవల చైనాను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి మధ్య భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. తాజాగా ఈ రెండు దేశాల మధ్య భారీ ఆయుధ ఒప్పందం కూడా కుదిరింది. 8 సబ్ మెరైన్లను పాకిస్థాన్ నావికాదళానికి సరఫరా చేసేందుకు చైనా అంగీకరించింది. సుమారు 33 వేల కోట్ల విలువైన ఈ డీల్ లో భాగంగా 2023 నాటికి నాలుగు సబ్ మెరైన్లు అందజేయనుంది. 2028 నాటికి మిగిలిన నాలుగింటిని చైనా పాక్ కు సరఫరా చేయనుంది. పాక్ లోని కరాచీ బేస్ లో వీటిని తయారు చేస్తారు. ఈ ఒప్పందంపై పాక్ నేవీ ఉన్నతాధికారులు ఆ దేశ పార్లమెంటరీ కమిటీకి నివేదిక సమర్పించారు. ఫ్రాన్స్ సహకారంతో భారత్ 8 అత్యాధునిక స్కార్పీన్ సబ్ మెరైన్లు సమకూర్చుకోనుంటుండగా, వాటి వివరాలు తాజాగా లీకైన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఒప్పందానికి దీటుగా చైనాతో 8 సబ్ మెరైన్ల తయారీకి పాక్ ఒప్పందం చేసుకుంది. అయితే ఈ సబ్ మెరీన్లను పాక్ లోనే తయారు చేయనుండడంతో వీటికి సంబంధించిన వివరాలను కాపాడుకునేందుకు పాక్ జాగ్రత్తలు తీసుకుంటోంది.