: చదువు అబ్బకపోవడం వల్లే ఆటల్లో కొనసాగా: బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్
చదవు సరిగ్గా అబ్బకపోవడం వల్లే తాను క్రీడల్లోకి వచ్చానని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ, తాను, తన సోదరుడు క్రీడల్లో ఉండేవారమని చెప్పారు. తన సోదరుడు బ్యాడ్మింటన్ లో స్టేట్ చాంపియన్ అని కూడా గుర్తుచేసుకున్నారు. తరువాత ఐఐటీలో మంచి ర్యాంకు సాధించడంతో వెళ్లి ఐఐటీలో జాయిన్ అయ్యాడని, తనకు ర్యాంకు రాకపోవడంతో షటిల్ క్రీడాకారుడిగా మారానని చెప్పారు. తాను ఇంజనీరింగ్ పరీక్షలో ఫెయిలయ్యానని అన్నారు. చదువులో చురుగ్గా లేకపోవడం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. బ్యాడ్మింటన్ అకాడమీ నెలకొల్పిన సమయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని, తనకు చాలా మంది సహాయం చేశారని ఆయన చెప్పారు. 2004లో 25 మంది పిల్లలతో అకాడమీని స్థాపించానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒలింపిక్ పతకం కల 2012లో సైనా నెహ్వాల్ తీర్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.