: కొలంబియాలో చారిత్రక 'కాల్పుల విరమణ' ఒప్పందం.. 52 ఏళ్ల సాయుధ పోరుకు తెర
కొలంబియాలో 52 ఏళ్లుగా రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా (ఎఫ్‌ఏఆర్‌సీ) తిరుగుబాటు దారులకు, ప్రభుత్వానికి మధ్య రణరంగ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయుధాలతో విరుచుకుపడిన తిరుగుబాటుదారులు, పోలీసుల పోరులో ఈ కాల వ్యవధిలో 2,00,050 మందికి పైగా మృత్యువాతపడ్డారు. అయితే తాజాగా చారిత్రక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో ఇకపై అక్కడ ప్రశాంత వాతావరణం కొనసాగనుంది. ఈ ఒప్పందం ఈనెల 29 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిందని ఆ దేశ అధ్యక్షుడు జువాన్ మాన్యుయల్, ఎఫ్‌ఏఆర్‌సీ అధినేత తిమోలియన్ జిమినెజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మాన్యుయేల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తాము ఇక తుపాకులకు విశ్రాంతి ఇస్తున్నామని పేర్కొన్నారు. రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియాతో పోరు ఇక ముగిసిపోయిందని ఆయన అన్నారు.