: యువతుల సల్వార్ కమీజుల్లో డబ్బు కట్టలు దాచి కాశ్మీర్లోకి పంపుతున్న ఉగ్ర సంస్థలు
జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ, మరిన్ని నిరసనలకు పురిగొల్పుతూ, వారికి లక్షలాది రూపాయలను వివిధ ఉగ్రవాద సంస్థలు ఎలా పంపుతున్నాయో నిఘా వర్గాలు పసిగట్టాయి. నిరసనకారులకు హవాలా నిధులు అందుతుండటంపై మొత్తం ఆరు కేసులను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నమోదు చేసింది. యువతులు ధరించే సల్వార్ కమీజుల లోపలి భాగాల్లో జేబులు కుట్టించి వాటిల్లో డబ్బు కట్టలను పెడుతున్నారని, దానిపై బురఖాలు ధరించే వారు అనుమానం రాకుండా డబ్బులను చేర్చాల్సిన చోటికి చేరుస్తున్నారని పోలీసు వర్గాలు పసిగట్టినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్లను కూడా డబ్బు బట్వాడాకు వాడుతున్నారని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి కాశ్మీర్ వేర్పాటు వాదుల ఖాతాల్లోకి ఈ డబ్బు వస్తోందని, ఆపై వారు నగదును యువకులకు పంచుతున్నారని వార్తలు వచ్చాయి. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ వంటి సంస్థలు శిక్షణ పొందిన మిలిటెంట్లను జమ్మూలోకి చొప్పించి, వారి నాయకత్వంలో నిరసనలను పెంచుతున్నాయని కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.