: రోడ్లపై ఎంతనీరు?... బోట్లు వేసుకుని వచ్చారా? అంటూ నవ్వులు విరబూయించిన జాన్ కెర్రీ!
"రోడ్లపై ఇంత నీరుంది... మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు? బోట్లు వేసుకుని వచ్చారా?" అని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఢిల్లీ ఐఐటీ విద్యార్థులను ప్రశ్నించిన వేళ నవ్వులు విరబూశాయి. తాను ఎన్నడూ చూడనంత వర్షాన్ని ఢిల్లీలో చూశానని, రహదారులపై ఇంత నీరు చేరడం చూసి తన పర్యటనల్లో చాలా వాటిని రద్దు చేసుకున్నానని చెప్పిన ఆయన, తాను కూడా అతి కష్టం మీద రాగలిగానని చెప్పారు. ఇండియాలో జీఎస్టీ బిల్లు అమలు కానుండటం వల్ల విదేశీ పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడతాయని అభిప్రాయపడ్డ ఆయన, వచ్చే సంవత్సరంలో ఇండియా, అమెరికాలు సంయుక్తంగా నిర్వహించే ఇన్వెస్టర్ల కాన్ఫరెన్స్ తో ఇక్కడి వ్యాపారుల సత్తా ప్రపంచం మొత్తానికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అవినీతిపై పోరాడేందుకు విద్యార్థిలోకం శ్రమించాలని సూచించారు.