: రూ. 9 కోట్లు తీసుకున్న ప్రశాంత్ కిషోర్ ఎక్కడ?: బీజేపీ సూటి ప్రశ్న
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహాదారు పదవిలో నియమించబడి రూ. 9 కోట్లు తీసుకున్న ప్రశాంత కిషోర్ ఏమైపోయాడని బీజేపీ నేతలు ప్రశ్నించారు. బీహార్ లో మహా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు తనవంతు టెక్ సాయం చేసిన ప్రశాంత్ ను నితీశ్ కుమార్ తన సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. బీహార్ రాష్ట్రానికి 2025 విజన్ డాక్యుమెంట్ తయారీ బాధ్యతలను నితీశ్ సర్కారు ప్రశాంత్ కే అప్పగించింది. అందుకు ఆయనకు ప్రతిఫలంగా రూ. 9.31 కోట్లను కూడా బీహార్ ప్రభుత్వం ఇచ్చింది. అయితే, నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత, ప్రశాంత్ ఆ రాష్ట్రానికి వచ్చిన సందర్భాలు కూడా పెద్దగా ఏమీ లేవు. అటువంటి అతనికి వేతనమివ్వడాన్ని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ప్రశ్నించారు. తక్షణమే అతన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, బీహార్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ , ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే బృహత్తర బాధ్యతలను తలకెత్తుకున్న సంగతి తెలిసిందే. 1989 తరువాత తిరిగి కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టేందుకు తన టీమ్ తో నిత్యమూ శ్రమిస్తున్నారు. అందుకే, ప్రశాంత్ బీహార్ పనిని వదిలేసి కాంగ్రెస్ పని చేస్తున్నారన్నది బీజేపీ ప్రధాన ఆరోపణ.