: ఒక్కసారిగా 4 అడుగులు పెరిగిన హుస్సేన్ సాగర్
ఈ ఉదయం హైదరాబాద్ లో కురిసిన కుంభవృష్టికి నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఒక్కసారిగా నాలుగు అడుగులకు పైగా పెరిగింది. బంజారాహిల్స్, సోమాజిగూడ, బేగంపేట, మెహిదీపట్నం, టోలీచౌకీ, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్ పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు వరదగా మారి హుస్సేన్ సాగర్ లోకి ఒక్కసారిగా వచ్చి చేరడంతో నీటి మట్టం పెరిగింది. మరో రెండు అడుగుల నీరు చేరితే, గేట్లు తెరిచి మూసీ నదిలోకి నీటిని వదలాల్సి వుంటుంది. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, రాజ్ భవన్ సమీపంలో రైలు పట్టాలపై భారీగా నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు.