: 8 తూటాలు దిగినా వెన్ను చూపని వీరుడు.. జీవితం దేశసేవకే అంకితమన్న జవాన్
దేశ సమగ్రతను ఉగ్రవాదులు దెబ్బతీయలేరని, భయోత్పాతం సృష్టించి సైనికుల ఆత్మస్థైర్యాన్ని ఇసుమంతైనా చెదరగొట్టలేరని నిరూపిస్తున్నాడు సీఆర్పీఎఫ్ జవాను ఖుర్షీద్. జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఖుర్షీద్ ఈ ఏడాది జూన్ 25న కశ్మీర్‌లో షూటింగ్ ప్రాక్టీస్ అనంతరం సహచరులతో కలిసి బయలుదేరాడు. పాంపోర్ వద్ద వారు ప్రయాణిస్తున్న జీప్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఎనిమిదిమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖుర్షీద్ గుండెలు, భుజం, మోచేయి, వెన్నెముక దిగువభాగం, పొత్తికడుపును 8 బుల్లెట్లు చీల్చేశాయి. కొనఊపిరితో ఉన్న అతడిని వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. శస్త్రచికిత్స చేసి శరీరంలోని ఏడు బుల్లెట్లను వైద్యులు తొలగించారు. అయితే వెన్నెముక కింద ఉన్న బుల్లెట్‌ను ఇప్పుడు తీయడం సాధ్యం కాదని, తొలగిస్తే అతడి ప్రాణాలకే ప్రమాదమని భావించిన వైద్యులు దానిని ముట్టుకోలేదు. అయితే దీనివల్ల ఖుర్షీద్‌కు శాశ్వత అంగవైకల్యం వచ్చే ప్రమాదముందని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి బెడ్‌పైనే ఉన్న ఖుర్షీద్ మాత్రం ఈ ఘటనతో ఏమాత్రం కుంగిపోలేదు. తన ఆత్మస్థైర్యం అణువంతైనా తగ్గలేదని చెబుతున్నాడు. కోలుకున్నాక తన జీవితం మొత్తాన్ని దేశసేవకే అంకితం చేస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. ‘‘ఉగ్రవాదులు నన్ను చంపాలని ప్రయత్నిస్తే, భగవంతుడు నన్ను కాపాడాడు. నా మిగిలిన జీవితం దేశానికే అంకితం’’ అని చెప్పుకొచ్చాడు.