: నయీం కేసులో తొలి వికెట్ డౌన్.. సీఐపై వేటు
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో తొలి వికెట్ పడింది. నల్గొండ టూటౌన్ సీఐ రవీందర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను జిల్లా హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల సిట్ 'ఐ10' టీవీ చానల్ సీఈవో హరిప్రసాద్‌రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. నయీం గ్యాంగుకు సీఐ సహకరించినట్టు విచారణలో ఆయన పేర్కొన్నాడు. దీంతో సీఐపై వేటేసినట్టు తెలుస్తోంది. ఇక నయీం ప్రధాన అనుచరుల్లో ఒకడైన నల్గొండ జిల్లాకు చెందిన సంజీవరెడ్డిని మంగళవారం రాత్రి పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ సమీపంలో సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నయీంకు చెందిన వందల కోట్ల ఆస్తులకు సంజీవరెడ్డి బినామీ అని దర్యాప్తులో తేలింది. సంజీవరెడ్డి అరెస్ట్ విషయాన్ని ఇప్పటి వరకు పోలీసులు నిర్ధారించలేదు. అయితే ముత్తంగి విష్ణు లాడ్జిలో తన కొడుకుతో పాటు సంజీవరెడ్డి 204 గదిలో దిగాడని, సిట్ సిబ్బంది దాడిచేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారని లాడ్జి సిబ్బంది తెలిపారు. అలాగే భువనగిరికి చెందిన న్యాయవాది ఎంఏ రహీంను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.