: బలహీనంగా ఓటుకు నోటు కేసు.. చెల్లదంటున్న న్యాయ నిపుణులు
గతంలో కొంతకాలం హల్‌చల్ చేసి తర్వాత ఊసే లేకుండా పోయిన ఓటుకు నోటు కేసు వ్యవహారంపై మళ్లీ చర్చమొదలైంది. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లక తప్పదని ఏపీ ప్రతిపక్ష నేతలు, టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తుండగా, అసలు కేసే చెల్లదని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసు తాజా పరిణామాలపై న్యాయనిపుణల మధ్య కూడా తర్జన భర్జన జరుగుతోంది. ఉన్నత న్యాయస్థానాల తీర్పులను బట్టి చూస్తే ఈ కేసు బలహీనంగా తయారైందని చెబుతున్నారు. ఏసీబీ పెట్టిన కేసే చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు తాజాగా అది ఇచ్చే ఆదేశం ఎలా చెల్లుతుందని ప్రశ్నిస్తున్నారు. కాగా తాము తీసుకున్న ఆడియో టేపుల్లోని గొంతు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని తేలిందని, మళ్లీ విచారణ జరపాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసు హైకోర్టును చేరడంతో న్యాయమూర్తి స్పష్టంగా తీర్పు చెప్పారు. ఇది ఎన్నికల నియమ నిబంధనల కిందకు వస్తుంది తప్ప అవినీతి నిరోధక చట్టం కిందికి రాదని, దీనిని ఏసీబీ విచారించ జాలదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్‌రావు తీర్పు చెప్పారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కేసును స్వీకరించిన కోర్టు స్టే మాత్రం ఇవ్వలేదు. ఎక్కడి నుంచో తీసుకొచ్చిన టేపును తీసుకొచ్చి తమకు నచ్చిన చోట పరీక్షలకు పంపి వాటి ఆధారంగా కేసును మళ్లీ విచారించాలని కోరారని, ఇటువంటి వాటిపై న్యాయస్థానాలు ఆచితూచి స్పందించాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఓ నిపుణుడు పేర్కొన్నారు. గతంలో మద్యం కేసులో ఇలాగే జరిగిందని చెబుతున్నారు. ఎటొచ్చీ ప్రస్తుతం ఈ ఓటుకు నోటు కేసు బలహీనంగా మారిందని, ఇది నిలబడే అవకాశమే లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.