: ‘ఫ్లోటస్’ అంటూ పాక్ రాయబారి ట్వీట్ పై అగ్రరాజ్యం ఆగ్రహం!
అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామాను ‘ఫ్లోటస్’ అంటూ అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి జలీల్ అబ్బాస్ జిలానీ ఇటీవల చేసిన ట్వీట్ పై అగ్రరాజ్యం మండిపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. గత మే నెలలో మిషెల్లీతో జిలానీ, ఆయన భార్య కలిసి దిగిన ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ, ‘ఫ్లోటస్ కు పాకిస్థాన్ హౌస్ లో ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందం కల్గిస్తోంది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, అమెరికా ప్రథమ పౌరురాలైన మిషెల్లీ ఒబామాను ఫ్లోటస్ (ఫస్ట్ లేడీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్) అని ఆమె సన్నిహితులు మాత్రమే పిలుస్తారు. అధికారికంగా ఇలా పిలవడాన్ని అనుమతించరు. అయితే, ఈ ట్వీట్ చేసిన కొంతసేపటికే ఆయన దానిని తొలగించారు కూడా. తాజాగా, ఈ వ్యవహారంపై జిలానీని తీవ్రంగా మందలిస్తూ అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఒక లేఖ పంపినట్లు కథనాలు వెలువడ్డాయి. ఒబామా కుటుంబంతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయం కలిగించేందుకే జిలానీ ఈ ఫొటో, ట్వీట్ చేశారని, ఇది సరికాదని వైట్ హౌస్ పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. కాగా, ఒబామా కూతుళ్లు, పాక్ రాయబారి జిలానీ కొడుకు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. జిలానీ కొడుకు గ్రాడ్యుయేషన్ పార్టీకి మిషెల్లీ హాజరైనట్లు సమాచారం.