: అన్నీ మంచి శకునాలే... 440 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్, రూ. 1.40 లక్షల కోట్లు పెరిగిన సంపద


ఆగస్టు నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ ముగింపు రోజున కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఆసియా మార్కెట్ల నుంచి అందిన సంకేతాలకు తోడు యూరప్ మార్కెట్ల సరళి, వృద్ధి రేటు పెరగవచ్చన్న సంకేతాలు, దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచగా సెన్సెక్స్ బుల్ హైజంప్ చేసింది. సెషన్ ప్రారంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 160 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, మరే దశలోనూ వెనక్కు తిరిగి చూడలేదు. సెన్సెక్స్ సూచిక 440 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ అత్యంత కీలకమైన 8,700 పాయింట్ల పైన బలమైన మద్దతును పొందింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1.40 లక్షల కోట్లకు పైగా పెరిగింది. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 440.35 పాయింట్లు పెరిగి 1.58 శాతం లాభంతో 28,343.01 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 136.90 పాయింట్లు పెరిగి 1.59 శాతం లాభంతో 8,744.35 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.80 శాతం, స్మాల్ కాప్ 1.02 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 48 కంపెనీలు లాభపడ్డాయి. అంబుజా సిమెంట్స్, బోష్ లిమిటెడ్, గ్రాసిమ్, ఏసీసీ, ఐచర్ మోటార్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, భారతీ ఎయిర్ టెల్, ఐడియా, జడ్ఈఈఎల్, బీహెచ్ఈఎల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,927 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,628 కంపెనీలు లాభాలను, 1,076 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. సోమవారం నాడు రూ. 1,09,31,650 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,10,71,127 కోట్లకు పెరిగింది.

  • Loading...

More Telugu News