: ‘ద కపిల్ శర్మ షో’ను మించిన వ్యూస్.. బ్యాడ్మింటన్ స్టార్ సింధు ఫైనల్ మ్యాచ్‌ని భారత్‌లో ఏకంగా 6.65 కోట్లమంది వీక్షించారట!
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఇటీవలే ముగిసిన ఒలింపిక్స్‌లో అంచనాలకు మించి రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి. సింధు స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌తో ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తి రేపిన ఆ మ్యాచ్‌ను క్రీడాభిమానులు కోట్ల సంఖ్యలో టీవీలకు అతుక్కుపోయి మరీ చూసేశారు. భారత్‌లో ఎన్నడూ లేని విధంగా 6.65 కోట్లమంది ప్రజలు ఈ మ్యాచ్‌ను చూశారని మీడియా రీసెర్చ్ సంస్థ జపర్ పేర్కొంది. రియో పోటీల్లో భారతీయ అభిమానులు అత్యధికులు చూసిన సింగిల్ మ్యాచ్ గా సింధు ఫైట్ నిలిచింది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది వీక్షించే నెంబర్ వన్ షో ‘ద కపిల్ శర్మ షో’ను కూడా ఈ మ్యాచ్ కిందకు నెట్టేసింది. ఈ షోను ప్రతివారం ఐదు కోట్ల మంది అభిమానులు టీవీల్లో వీక్షిస్తుండగా రియోలో సింధు ఆడిన ఫైనల్ మ్యాచ్‌ను కోటి అరవై ఐదు లక్షల మంది ప్రజలు ఎక్కువగా చూశారట. అంటే మొత్తం 6.65 కోట్లమంది వీక్షించారట. మీడియా రీసెర్చ్ సంస్థ జపర్ తెలిపింది. రియోలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సింధు ఆడుతున్న మ్యాచ్‌లకు రోజురోజుకీ వ్యూయర్‌షిప్ పెరుగుతూ వచ్చిందని ఆ సంస్థ తెలిపింది. సింధు మ్యాచ్‌లకు మొదట 16.4 మిలియన్ల వ్యూయర్‌షిప్ ఉందట. ఆ తరువాత అది పెరుగుతూ వచ్చి స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌తో సింధు తలపడిన మ్యాచ్‌కు విపరీతంగా పెరిగిపోయింది. సింధు రియోలో ఆడిన సెమీఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో చూసిన అభిమానుల్లో 57.4శాతం మంది తుది పోరును కూడా లైవ్‌లో చూశారట. సింధుపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న ప్రేక్షకులు ఆమె అద్భుతంగా రాణించడాన్ని చూసి గెలుస్తుందనే నమ్మకం పెట్టుకొని ఎంతో ఆసక్తితో ఆ మ్యాచ్ చూశారట.