: టెన్త్ కూడా చదవని ముంబై టీనేజర్ మాళవికా జోషికి మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ లో ప్రవేశం


మాళవికా జోషి... ముంబైకి చెందిన 17 ఏళ్ల టీనేజర్. ఆమె టెన్త్ కూడా చదవలేదు. కానీ తన అద్భుత కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నైపుణ్యంతో ప్రతిష్ఠాత్మకమైన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ప్రవేశాన్ని పొందింది. మార్కుల కంటే మెరిట్ మాత్రమే ముఖ్యమని చెబుతున్న ఆమె కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏ మాత్రం సాధారణ విద్యను చదవకుండానే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్ (ప్రోగ్రామింగ్ ఒలింపియాడ్)లో మూడు సార్లు పాల్గొని రెండుసార్లు సిల్వర్, ఓ సారి బ్రాంజ్ మెడల్స్ కొట్టిన ఆమెకు స్కాలర్ షిప్ తో కూడిన ప్రవేశాన్ని ఎంఐటీ ఆఫర్ చేసింది. డైరెక్టుగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పించింది. ఇప్పుడిక తనకు ఇష్టమైన కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో మరింత ఉన్నత స్థితికి చేరుతానని మాళవిక నమ్మకంగా చెబుతోంది. బోస్టన్ లోని ఎంఐటీ నుంచి తనకు తొలిసారిగా అందిన ఈ-మెయిల్ గురించి గుర్తు చేసుకుంది. తాను నాలుగేళ్ల క్రితమే పాఠశాలకు వెళ్లడం మానేశానని, ఆపై ఎన్నో సబ్జెక్టులను పరిశీలించగా, ప్రోగ్రామింగ్ పై ఆసక్తి కలిగిందని చెప్పుకొచ్చింది. భారత ఐఐటీల్లో తనకు ప్రవేశం లభించలేదని, ఇంటర్ పాస్ కాకుండా ప్రవేశాలకు అర్హత లేని కఠిన నిబంధనలు తనను అడ్డుకున్నాయని తెలిపింది. తనకు బీఎస్సీ స్టాండర్డ్స్ ఉండటం చూసిన చెన్నై మేథమెటికల్ ఇనిస్టిట్యూట్ మాత్రం ఎంఎస్సీ స్థాయి విద్యాభ్యాసానికి ప్రవేశం కల్పించిందని వెల్లడించింది. ఇండియన్ కంప్యూటింగ్ ఒలింపియాడ్ లో ఆమె ప్రతిభను చూసిన నేషనల్ కో-ఆర్డినేటర్ మాధవన్ ముకుంద్ ప్రోత్సాహంతో తన ప్రతిభను మరింతగా పెంచుకుంది. ఇప్పుడు ఎంఐటీలో చదివి దేశానికి సేవ చేస్తానని చెబుతోంది. ఇంతకూ మాళవిక అధికారికంగా చదివింది ఎంతవరకో తెలుసా? ముంబైలోని దాదార్ పార్సీ స్కూల్లో ఏడవ తరగతి వరకూ మాత్రమే.

  • Loading...

More Telugu News