: కాంగ్రెస్ పార్టీ అద్దె ఇల్లులా అనిపించింది... ఇప్పుడు సొంత ఇంటికి చేరుతున్నాం!: దేవినేని నెహ్రూ
తాను, తన కుమారుడు అవినాష్ నేటి ఉదయమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని విజయవాడ కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన ఈ ఉదయం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. ఆపై మీడియాతో మాట్లాడుతూ, తనకు తెలుగుదేశం పార్టీ కొత్త పార్టీ కాదని, పార్టీ ఆవిర్భావంలో జెండాకు రూపకల్పన చేసే సమయం నుంచే తనకు భాగస్వామ్యం ఉందని అన్నారు. పరిస్థితుల కారణంగా కొంత కాలం పార్టీకి దూరంగా ఉన్నానని, ఇప్పుడు తనకు సొంతింటికి చేరుతున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తనకు అద్దె ఇల్లులా అనిపించేదని అన్నారు. తన రాజకీయ పునాదులన్నీ ఇక్కడే ఉన్నాయని నెహ్రూ తెలిపారు. తనది పార్టీలు మారే మనస్తత్వం కాదని, కాంగ్రెస్ లోకి వెళ్లిన వేళ ఎంతో బాధపడి వెళ్లానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు రాత్రిబవళ్లూ కష్టపడ్డానని, పార్టీ ఏమిచ్చిందని ఎన్నడూ చూడలేదని అన్నారు. సెప్టెంబర్ 15న తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.