: వీవీఐపీ చాపర్ కుంభకోణం... అరెస్ట్ చేయబోమని హామీ ఇస్తే నిజం చెబుతానంటున్న మధ్యవర్తి
సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం మరో కీలక మలుపు తిరిగింది. తనను అరెస్ట్ చేయబోమన్న హామీని ఇస్తే, ఇండియాకు వచ్చి విచారణకు సహకరించేందుకు అభ్యంతరం లేదని మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైఖేల్ నుంచి సీబీఐకి వర్తమానం అందింది. తనపై ఉన్న ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులను ఉపసంహరించుకోవాలని, భారత అధికారులను దుబాయ్ లో కలిసి సాక్ష్యమిచ్చేందుకు తనకు అభ్యంతరం లేదని అన్నారు. ఈ కేసులో మధ్యవర్తి నుంచి కేసును విచారిస్తున్న సీబీఐకి ఇలాంటి సమాచారం రావడం ఇదే తొలిసారి. ఆగస్టు 25వ తేదీతో మైఖేల్ జేమ్స్ లేఖను రాస్తూ, దుబాయ్ లోని భారత కాన్సులేట్ కు సీబీఐ అధికారులు వస్తే, తాను వారి ముందు నిలుస్తానని చెప్పడం గమనార్హం. ఈ కేసులో తాను అమాయకుడినని, కొంత సమాచారం మాత్రమే తనకు తెలుసునని ఆయన అన్నారు. కాగా, రూ. 3,727 కోట్ల విలువైన 12 వీవీఐపీ చాపర్లను కొనుగోలు చేయాలన్న డీల్ లో రూ. 370 కోట్లకు పైగా లంచాల బాగోతం జరిగినట్టు ఆరోపణలు రాగా, సీబీఐ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే.