: గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జీఎస్‌టీని మోదీ వ్యతిరేకించారు: శాసనసభలో చిన్నారెడ్డి
జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలపడమే లక్ష్యంగా తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి బిల్లుపై మాట్లాడారు. ఒకే దేశం ఒక పన్ను విధానానికి బిల్లును 2011లోనే యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని ఆయన గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు సహకరించకపోవడం వల్ల ఆ బిల్లు పాస్ కావడానికి ఇన్నాళ్లు పట్టిందని ఆయన అన్నారు. ఈ బిల్లుపై చాలా మందికి అపోహలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జీఎస్‌టీ బిల్లుని మోదీ వ్యతిరేకించారని అన్నారు. ఒకనాడు జీడీపీ ఆదాయంలో వ్యవసాయం ప్రథమస్థానంలో ఉండేదని, రెండో స్థానం పారిశ్రామిక రంగానిదని, మూడో స్థానంలో సర్వీస్ రంగం ఉండేదని చిన్నారెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడది రివర్స్ అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు దాదాపు 60 శాతం ఆదాయం సేవారంగం ద్వారానే వస్తోందని వివరించారు. జీఎస్‌టీ అమలయితే కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని, కొన్నింటి ధరలు పెరుగుతాయి. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధే రెండు కళ్లుగా ముందుకెళ్లాలని సూచించారు. బిల్లుని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.