: 90 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ డ్రస్ కోడ్ కి బై... దసరానుంచి కొత్త కోడ్!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) డ్రస్ కోడ్ మారనుంది. వచ్చే దసరానుంచే సంఘ్ కార్యకర్తలు కొత్త డ్రస్ కోడ్‌లో కనిపించనున్నారు. నిక్కర్లు ధరించడం పట్ల తమపై పలువురు కామెంట్లు చేస్తున్నారని కొత్తగా ఈ సంస్థలో చేరుతున్న యువకులు వాపోతున్నారు. ఇంతవరకు వారు ఖాకీ నిక్కర్లను ధరిస్తూ సంఘ్ నిర్వహిస్తోన్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక పై ఆ స్థానంలో ముదురు గోధుమ వర్ణపు ప్యాంట్లు కనపడనున్నాయి. ఎంతో కాలంగా ఆర్ఎస్ఎస్ డ్రస్ కోడ్‌లో మార్పులు తీసుకురావాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. చివరికి తుది నిర్ణయం తీసుకొని ముదురు గోధుమ వర్ణపు ప్యాంట్లు ధరించాలని నిర్ణయించుకుంది. కార్యకర్తలు ఇంతవరకు తెల్ల చొక్కా, ఖాకీ నిక్కరు ధరించేవారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడిన 90 ఏళ్ల నుంచి ఇదే డ్రస్ కోడ్ కొనసాగుతోంది. ఇపప్టికే సంఘ్ నాగపూర్ ప్రాంతాల్లో అధికారికంగా కొత్త డ్రస్‌ను విక్రయిస్తోంది. ముదురు గోధుమ వర్ణంలో ఉండే జంట ప్యాంటులను రూ.250లకు అందిస్తున్నారు. కార్యకర్తల ఎత్తు దృష్ట్యా ప్యాంటులో మరో రెండు అంగుళాలు పెంచడానికి మరో 10 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ఈ ఏడాది మార్చిలోనే డ్రస్ కోడ్ మార్పునకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఎస్ఎస్ తెలిపింది. తమ నిర్ణయాన్ని దసరా రోజు (అక్టోబర్ 11) నుంచి అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.