: ఒంగోలు అస్తవ్యస్తం.. నంద్యాల అతలాకుతలం... ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఒంగోలు, నంద్యాల ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం కాగా, సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒంగోలులో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు నిల్వ ఉంచిన ప్రాంతంలో వర్షపు నీరు చేరి కోట్లాది రూపాయల విలువైన ఆస్తి నష్టం సంభవించింది. సంతనూతలపాడు, పొదిలి, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. మార్కాపురంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కర్నూలు జిల్లాలో ఉదయం నుంచి అక్కడక్కడా వర్షాలు పడుతుండగా, నంద్యాలలో ఏకంగా 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, బస్టాండ్, మార్కెట్ తదితర ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఆదోని, మంత్రాలయం ప్రాంతంలో వాగులు పొంగి రోడ్లపైకి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. బండి ఆత్మకూరు మండలం సింగవరంలో కురిసిన భారీ వర్షానికి ఆముదాల చెరువు నిండిపోగా, రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే, చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలోని మద్దిలేరు, పోతుల వాగు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నంద్యాల నుంచి కోవెలకుంట్ల వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచాయి. కోడుమూరు మండలంలో 18.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అటు అనంతపురం జిల్లాలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధర్మవరం, బత్తలపల్లి మండలాల్లో తెల్లవారుఝాము నుంచి వర్షాలు కురుస్తుండగా, శింగనమల, కదిరి, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. రాప్తాడు, మడకశిర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. పలు చోట్ల 5 నుంచి 10 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంటుమిల్లి, జగ్గయ్యపేట, ఏలూరు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. గుడివాడ నుంచి బంటుమిల్లి వెళ్లే మార్గంపై మూడు భారీ వృక్షాలు కుప్పకూలడంతో ట్రాఫిక్ స్తంభించింది. నందిగామలో కురిసిన వర్షానికి రహదారులు నీటితో నిండిపోయాయి. గన్నవరంలో దట్టమైన మేఘాలు అలముకుని వర్షం పడుతుండటంతో ఓ విమానం రద్దయింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాలన్నిటినీ వరుణుడు పలకరించాడు. ఈ ప్రాంతంలో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. నరసరావుపేటలో భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.