: రజత పతకంగా మారనున్న యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్ కాంస్య పతకం!
2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన రెజ్లర్ యోగేశ్వర్‌దత్ తాజాగా రజత పతకం అందుకోనున్నాడు. ఆ పోటీల్లో రజత పతకం సాధించిన రష్యాకు చెందిన బెసిక్ కుదుకోవ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు నిర్ధారణ కావడంతో పతకాన్ని కోల్పోనున్నాడు. తద్వారా కాంస్య పతక విజేత అయిన యోగేశ్వర్‌దత్‌కు అది దక్కనుంది. నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్స్ విజేత అయిన కుదుకోవ్ 2013లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు అతడికి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ డోప్ పరీక్షలు నిర్వహించింది. అందులో అతడు పోటీలో పాల్గొనడానికి ముందు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతడు పతకాన్ని కోల్పోనున్నాడు. ఫలితంగా ఆ పోటీల్లో కాంస్య పతకం సాధించిన యోగేశ్వర్‌కు రజతం దక్కనుంది. అయితే ఈ విషయాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.