: నేడు తమిళనాడు బంద్... నీళ్ల కోసం రైతుల పోరాటం!
నేడు తమిళనాడులో బంద్ జరగనుంది. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ నుంచి నదీ జలాలు ఆగిపోవడంతో తమిళనాడులో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రైతులు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టారు. అందులో బాగంగా కొన్ని రైతు సంఘాలు ఇదివరకే బంద్ చేపట్టి తమ నిరసన వ్యక్తం చేయగా, నేడు మరికొన్ని రైతు సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో తమిళనాడులోని వెయ్యి ప్రాంతాల్లో రాస్తారోకోలు, వంద చోట్ల రైల్ రోకోలు నిర్వహించనున్నారు. ఇందులో వివిధ సంఘాల రైతులతో పాటు, డీఎంకే, కాంగ్రెస్, టీఎంసీ, ముస్లిం లీగ్, వీసీకే తదితర పార్టీలు కూడా పాలుపంచుకోనున్నాయి. వీరికి లారీ, టిప్పర్ యజమానుల సంఘాలు కూడా మద్దతు ప్రకటించడం విశేషం. దీంతో నేటి సాయంత్రం 6 గంటలవరకు తమిళనాడు స్తంభించిపోనుంది. బంద్ కారణంగా తమిళనాడులోని 2.56 లక్షల లారీలు, లక్ష టిప్పర్లు, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన 1.32 లక్షల లారీలు నిలిచిపోనుండగా, వంద కోట్ల మేర కార్యకలాపాలు నిలిచిపోనున్నాయని లారీ యజమానుల సమ్మేళనం తెలిపింది.