: మోదీపై విరుచుకుపడిన చైనా మీడియా.. ప్రధాని సహనం కోల్పోయారని పిచ్చి రాతలు
భారత్ పేరెత్తితే ఉలిక్కిపడే చైనా మీడియా మరోమారు పొరుగు దేశంపై అక్కసు వెళ్లగక్కింది. బలూచిస్థాన్ విషయంలో భారత ప్రధాని వైఖరిపై ధ్వజమెత్తింది. మోదీ సహనం కోల్పోయారంటూ పిచ్చిరాతలు రాసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రబాధిత ప్రజలకు పరిహారంపై దుమ్మెత్తి పోసింది. బలూచిస్థాన్పై మోదీ వ్యాఖ్యలను ప్రస్తావించిన అధికారక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆయన బలూచిస్థాన్ గురించి మాట్లాడారని ఆరోపించింది. ‘‘ఇండో-పాక్ సంబంధాల పునరుద్ధరణపై నరేంద్రమోదీకి అంతగా ఇష్టం లేదు. భారత ప్రధానిగా ఆయన ప్రస్తుతం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టారు. సహనం కోల్పోయి కయ్యానికి కాలుదువ్వుతున్నారు’’ అని పేర్కొంది. పీఓకేలోని ఉగ్రవాద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల సాయంపైనా చైనా మీడియా విమర్శలు గుప్పించింది. ఇది రెచ్చగొట్టడమేనని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ బోర్డర్ వైపునున్న కశ్మీరీలు కూడా ఈ పరిహారాన్ని అందుకునే అవకాశం ఉండడమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున బలూచిస్థాన్, గల్గిత్, పీఓకేలలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై మాట్లాడారని పేర్కొంది. బలూచిస్థాన్పై మోదీ మాట్లాడిన తర్వాత చైనా అధికారిక మీడియా స్పందించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.