: పెల్లెట్ గన్స్ కంటే ముందు మిర్చి గ్రనేడ్లు ఉపయోగించండి: సైన్యానికి సిఫారసులు


కశ్మీరీ ఆందోళనకారులు ఇకపై రోడ్డెక్కితే కారం ఘాటుతో ఉక్కరిబిక్కిరి కానున్నారు. కశ్మీర్ లోయలో ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ వాడకంపై చాలా కాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీటి కారణంగా వందలాది మంది తీవ్రగాయాల పాలవుతున్నారని, వీటికి ప్రత్యామ్నాయం చూడాలంటూ చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి టీవీఎస్‌ఎన్ ప్రసాద్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల కమిటీని నియమించి, పెల్లెట్ గన్స్ వాడకం, ప్రత్యామ్నాయాలపై నివేదిక కోరింది. ఈ మేరకు దీనిపై అధ్యయనం చేసిన కమిటీ హోంశాఖ కార్యదర్శికి తమ నివేదిక సమర్పించింది. ఇందులో పెల్లెట్ గన్స్ కు బదులుగా కారం నింపిన గ్రెనేడ్లు (కారం బాంబులు), స్టన్ లాక్ షెల్స్ వాడాలని సూచించింది. అరుదైన సందర్భాల్లో మాత్రమే, తప్పనిసరి పరిస్థితుల్లో పెల్లెట్ గన్లను వాడాలని సూచించింది. నివేదికలోని ముఖ్యాంశాలేంటనేది పూర్తిగా వెల్లడించకపోవడం విశేషం. నోనివామైడ్ అని పిలిచే పెలార్గానిక్ యాసిడ్ వానిలైల్ అమైడ్ (పావా)తో పాటు స్టన్ లాక్ షెల్స్, లాంగ్ రేంజ్ అకోస్టిక్ డివైజ్ (లార్డ్) వంటి ప్రాణాంతకం కాని మందుగుండును పెల్లెట్ గన్లకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చునని కమిటీ ఈ నివేదికలో సూచించింది. కాగా, జమ్మూకాశ్మీర్ లోని కల్లోల ప్రాంతాల్లో 51 రోజులుగా విధించిన కర్ఫ్యూను మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మినహా ఎత్తివేశారు. దీంతో వివిధ చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.

  • Loading...

More Telugu News