: ఢిల్లీలో మరో అబలపై అఘాయిత్యం!


దేశరాజధాని ఢిల్లీ పేరెత్తితే యువతులు భయపడాల్సిన పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. నిర్భయ ఉదంతం తరువాత చోటుచేసుకున్న ఎన్నో ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేపాయి. తాజాగా చోటుచేసుకున్న సంఘటన మరింత భయాన్ని రేకిత్తిస్తోంది. బాధితురాలి బంధువు, ప్రత్యక్ష సాక్షి గీత వెల్లడించిన వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని భల్స్వా డెయిరీ ప్రాంతంలోని బాధిత యువతి కుటుంబం నివాసం ఉంటోంది. ఆ యువతిని వివాహం చేసుకుంటానని అభిషేక్ అనే యువకుడు ఆమెను అడిగాడు. దానికి ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆ యువతిపై కక్షగట్టిన అభిషేక్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఆమె బయటకు వెళ్లిన ప్రతిసారి అభిషేక్ తన స్నేహితులతో ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. దీంతో ఆమె తన సోదరుడికి విషయం వివరించింది. బయటకు వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఆమె సోదరుడు అభిషేక్ ను హెచ్చరించాడు. ఇకపై ఇలా జరిగితే చూస్తూ ఊరుకోనని ఆయన తెలిపారు. దీంతో పథకం ప్రకారం అభిషేక్ తన స్నేహితులైన విజయ్, కరణ్ మరో 20 మందితో కలిసి యువతి ఇంట్లోకి చొరబడ్డారు. చొరబడుతూనే ఇనుప రాడ్లతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులను చితకబాదారు. వారిలో నలుగురు అభిషేక్ బంధువులు కూడా ఉన్నారు. పెళ్లికి అంగీకరించలేదని నిందిస్తూ యువతిని కూడా రాడ్లతో చితకబాదారు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి పరారయ్యారు. దీంతో 95 శాతం కాలిన గాయాలైన బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స చేస్తున్న వైద్యులు ఆమె బతికే అవకాశాలు లేవని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News