: కాంగ్రెస్ పార్టీ పదేళ్లు కాపులను ఓటు బ్యాంకు కోసం వాడుకొని వదిలేసింది: బొండా ఉమా
కాంగ్రెస్ పార్టీ పదేళ్లు కాపులను ఓటు బ్యాంకు కోసం వాడుకొని వదిలేసిందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ కాపుల సంక్షేమంపై మాట మార్చలేదని, తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని వ్యాఖ్యానించారు. ఎన్ని కష్టాలున్నా కాపుల కోసం వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేశామని ఆయన అన్నారు. వాటితో 30 వేల మంది యువతకు లాభం చేకూరిందని పేర్కొన్నారు. ఎస్సీ, బీసీలకు ఏ విధంగా సాయం చేస్తున్నామో అలాగే విదేశాల్లో చదువుకుంటోన్న కాపు విద్యార్థులకు కూడా సాయం చేస్తున్నట్లు బొండా ఉమా తెలిపారు. తాము కాపుల సంక్షేమం అంశంలో తప్పించుకోవడం లేదని, తమపై అనవసర విమర్శలు చేయ్యొద్దని ఆయన సూచించారు.