: తెలుగు రాష్ట్రాల్లో రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాగల నాలుగు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రకాశం, గుంటూరు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో తేలిక పాటి జల్లులు, పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జగిత్యాల పోచమ్మవాడలో పలు ఇళ్లల్లోకి వర్షపు నీరు వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లా పల్నాడులో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాదు-గుంటూరు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.