: సినిమా హాల్ కార్మికుడి ఖాతా నుంచి రూ. 400 కోట్లు, పానీపూరీ అమ్మే వ్యక్తి నుంచి రూ. 600 కోట్లు విదేశాలకు... భారీ స్కాం గుట్టు రట్టు!
దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా మొత్తాన్ని దేశం బయటకు పంపించిన భారీ కుంభకోణాన్ని ముంబై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు కనిపెట్టారు. నాలుగు జాతీయ బ్యాంకులు, ఓ ప్రైవేటు బ్యాంకుకు సంబంధమున్న ఈ స్కాం దక్షిణ ముంబై నుంచి ఆరు బ్యాంకు శాఖల్లో జరిగింది. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య పలువురి ఖాతాల నుంచి విదేశాలకు నిధులు మళ్లాయి. అనామకుల పేరిట ఖాతాలు తెరచిన బడాబాబులు, వారికి ఎంతమాత్రమూ తెలియకుండానే డబ్బును దేశం దాటించారు. సినిమా హాల్లో పనిచేసే ఓ కార్మికుడి పేరిట ఉన్న ఖాతా నుంచి రూ. 400 కోట్లు, అలానే రైల్వే స్వీపర్, టికెట్ కలెక్టర్, పానీపూరీలు అమ్మే వ్యక్తుల పేరిట ఉన్న ఖాతాల ద్వారా రూ. 400 నుంచి రూ. 600 కోట్ల వరకూ ఫారిన్ ఖాతాలకు పంపారు. ఓ బోగస్ కంపెనీని స్థాపించడం, లావాదేవీ పూర్తి కాగానే వాటిని మూసివేయడం అక్రమార్కుల పనని డీఆర్ఐ అధికారి ఒకరు వివరించారు. ఒకే కంపెనీ ఈ స్కాంకు సూత్రధారని, ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి సరుకులు ఇంపోర్ట్ చేసుకున్నట్టు చూపారని, రూ. 25 కోట్ల ఖరీదు చేసే సరుకులు తెచ్చి వందల కోట్ల రూపాయలను పంపుతున్నా బ్యాంకులు పట్టించుకోలేదని ఆరోపించారు.