: ఉగ్రవాదుల్ని వేటాడే డ్రోన్లు కావాలని అమెరికాను కోరుతున్న రక్షణ మంత్రి పారికర్
సరిహద్దుల్లో చొరబాట్లు పెరిగిన వేళ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు ప్రిడేటర్ డ్రోన్ టెక్నాలజీని తమకు అందించాలన్న ప్రధాన అజెండాతో భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్, నేడు అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వీరిద్దరి మధ్యా ఇది ఆరవ సమావేశం కాగా, తమకు మానవ రహిత వేటాడే డ్రోన్లు సరఫరా చేయాలని కార్టర్ ను పారికర్ కోరనున్నారు. గతంలో ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ ప్రాంతాల్లో అమెరికా సైన్యానికి ఈ తరహా విమానాలు ఎంతో సహకరించాయి. అప్పట్లో భారత్ ఈ టెక్నాలజీని అందించాలని కోరినా అమెరికా వెనుకంజ వేసింది. ఇక గత జూన్ 27న ఎంటీసీఆర్ (మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజీమ్)లో ఇండియా చేరిన తరువాత యూఎస్ వైఖరిలో మార్పు వచ్చింది. ప్రస్తుత పారికర్ పర్యటనలో ఇరు దేశాలూ లిమోవా (లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్)పై సంతకాలు చేసే అవకాశాలు ఉన్నందున ఆ వెంటనే డ్రోన్ టెక్నాలజీని భారత్ కు ఇచ్చే అంశంపై ప్రాథమిక నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత్ ను ఎలా ఇబ్బందులు పెడుతోందో కూడా పారికర్ వివరించ వచ్చని సమాచారం. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి సంస్థలను నిలువరించలేక పోతున్న పాక్, వాటికి సహకరించడాన్ని ఆపేలా అమెరికా చర్యలు చేపట్టాలని కూడా పారికర్ కోరనున్నారు.