: ఆ వాయిస్ చంద్రబాబుదే!... ‘ఓటుకు నోటు’ కేసులో వైసీపీ నేత పిటిషన్!
తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చిన ‘ఓటుకు నోటు’ కేసును ఏపీలో విపక్షం వైసీపీ మరోమారు మండించింది. తెలంగాణ ఏసీబీ విచారణ చేపట్టిన ఈ కేసును పునర్విచారించాలని ఆ పార్టీకి చెందిన కీలక నేత, గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేటి ఉదయం ఆయన తెలంగాణ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసుల చేతికి చిక్కిన ఆడియో టేపుల్లోని ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి వాయిస్ ఏపీ సీఎం నారా చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చిందని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఆళ్ల పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు... సెప్టెంబర్ 29 లోగా కేసు పునర్విచారణను పూర్తి చేయాలని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది.