: ఇకపై పసిఫిక్ మీదుగా అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు.. తగ్గనున్న ప్రయాణ సమయం.. కోట్ల రూపాయల ఆదా!
భారత్ నుంచి అమెరికాకు విమానయానంలో మార్పులు జరగబోతున్నాయి. కొత్త మార్గంలో విమానాలను నడిపించేందుకు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నుంచి ఎయిర్ ఇండియాకు అనుమతి లభించింది. దీని వల్ల ఇకపై అమెరికాకు ప్రస్తుత ప్రయాణ సమయం కంటే గంట నుంచి మూడు గంటలు త్వరగా చేరుకోవచ్చు. భారత్‌నుంచి శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి ఎయిర్‌ఇండియా విమానాలు ఫసిఫిక్ మహాసముద్రం మీద నుంచి ప్రయాణించనున్నాయి. దీంతో ఇంధనం ఆదా కూడా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ విమానాలు దేశ రాజధాని ఢిల్లీ నుంచి అట్లాంటిక్ సముద్రం మీదుగా శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకుంటున్నాయి. నిజానికి ఈ కొత్త మార్గం ప్రస్తుతం విమానాలు నడుస్తోన్న మార్గం కంటే 1,400 కిలోమీటర్ల దూరం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫసిఫిక్ మహాసముద్రం మీదుగా విమానయానం వల్ల వాలు గాలుల ప్రభావం ఉంటుందని, దీని వల్ల త్వరగా అమెరికాకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. కొత్త మార్గంతో విమానాలు ప్రయాణిస్తే వేసవిలో గంట, శీతాకాలంలో మూడు గంటల తక్కువ సమయంలో అమెరికాకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం అట్లాంటిక్ సముద్రం మీదుగా వెళుతోన్న మార్గం ద్వారా ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకునేందుకు 17 గంటల సమయం పడుతోంది. అయితే పసిఫిక్ మహాసముద్రమార్గం మీదుగా వెళితే 14 గంటల సమయం నుంచి 16 గంటల సమయం మాత్రమే పడుతుంది. విమానం గంట ప్రయాణించేందుకు 9,600 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. కొత్త మార్గంలో ప్రయాణిస్తే వ్యవధి తగ్గి ఇంధన వినియోగం కూడా తగ్గడంతో కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుంది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో విమానాలు ప్రస్తుతం వారానికి మూడు నడుస్తున్నాయి. అయితే, నవంబరు నుంచి వారానికి ఆరు విమానాలను నడిపించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా విమానాలు నడిపేందుకు ఎయిరిండియా సంస్థ అన్ని సంస్థలకంటే ముందుగా మొదటిసారిగా అనుమతి పొందింది. కొన్ని సంవత్సరాల ముందు ముంబయి-షాంఘై- శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య జెట్ ఎయిర్‌వేస్ విమానం ప్రయాణించేది. అయితే ప్రస్తుతం అది నడవడం లేదు. ప్రస్తుతం విమానాలు అమెరికాకు వెళుతోన్న మార్గంలో 24 కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. వాటి వల్ల విమానం గంటకు సగటున 800 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా 776 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లేనని చెప్పారు. కొత్త మార్గం ద్వారా వెళితే 138 కిలోమీటర్ల వేగంతో మాత్రమే గాలులు వీస్తాయని పేర్కొన్నారు. దీంతో విమాన సగటు వేగం 938 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు. శీతాకాలంలో వాలుగాలులు అధికవేగంతో వీస్తాయని, దీంతో మూడు గంటల మేర సమయం తగ్గుతుందని తెలిపారు. వేసవిలో శీతాకాలం కంటే తక్కువగా వాలు గాలులు వీస్తాయని దీంతో ఒక గంట ఆదా అవుతుందని తెలిపారు.