: ప్ర‌భుత్వం చేసుకున్న‌ ఒప్పందాల‌కు వ్య‌తిరేకంగా ద‌శ‌ల‌వారీగా పోరాటాలకు దిగుతాం: రేవంత్‌రెడ్డి


ప్ర‌భుత్వం చేసుకున్న‌ ఒప్పందాల‌కు వ్య‌తిరేకంగా ద‌శ‌ల‌వారీగా పోరాటాలకు దిగుతామ‌ని టీటీడీపీ నేత‌ రేవంత్‌రెడ్డి ఈరోజు తెలిపారు. మ‌హారాష్ట్ర‌తో తెలంగాణ ప్ర‌భుత్వం చేసుకున్న ప్రాజెక్టుల ఒప్పందానికి నిర‌స‌న‌గా టీటీడీపీ నేత‌లు ఎల్‌.ర‌మ‌ణ‌, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎన్టీఆర్ భ‌వ‌న్‌నుంచి జ‌ల‌సౌధ‌కు బ‌య‌లుదేరారు. ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని ర‌ద్దు చెయ్యాలని అన్నారు. మ‌హా ఒప్పందంతో తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం క‌లుగుతుంద‌ని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణ ఖ‌జానాను కేసీఆర్ దివాళా తీస్తున్నార‌ని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్ర‌భుత్వం గుత్తేదారుల‌తోనూ చీక‌టి ఒప్పందం చేసుకుందని అన్నారు. ఒప్పందాల‌కు వ్య‌తిరేకంగా ద‌శ‌ల‌వారీగా పోరాటాలు చేస్తామ‌ని తెలిపారు. వాటి వ‌ల్ల వ‌చ్చే న‌ష్టాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని పేర్కొన్నారు. కేసీఆర్ స‌ర్కారు నీటి ప్రాజెక్టుల పేరిట దోపిడీకి పాల్ప‌డుతుందని అన్నారు. ప్రాజెక్టుల గురించి చ‌ర్చించేందుకు అఖిల‌ప‌క్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News