: లండన్ లోని చైనా ఎంబసీ ముందు 'మోదీ జిందాబాద్' నినాదాలు చేసిన బెలూచ్, సింధ్ పౌరులు
తమకు, పాకిస్థాన్ కు మధ్య ఉన్న ఆర్థికపరమైన వ్యవహారాల్లో కల్పించుకోవద్దంటూ చైనా ప్రభుత్వం భారత్ ను హెచ్చరించిన వేళ, లండన్ లోని చైనా ఎంబసీ ముందు బెలూచిస్థాన్, సింధ్ ప్రాంత నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించి చైనాకు వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. స్వాతంత్ర్యం తమ హక్కని, బెలూచ్ కోసం ప్రధాని మోదీ పోరాడతారని, మోదీ ముందడుగు వేస్తే తామంతా ఆయన వెనకే నడుస్తామని, సీపీఈసీ (చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్) వద్దే వద్దని, మోదీ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. బెలూచ్ నేత, ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న నోర్డిన్ మెంగాల్ ఈ నిరసనలకు నాయకత్వం వహించారు. బెలూచ్ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా పాక్, చైనాలు బెలూచిస్థాన్ ప్రాంతంలో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టరాదని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో సింధీ మాలూచ్ ఫోరమ్, ది వరల్డ్ సింధీ కాంగ్రెస్, బాలూచ్ నేషనల్ మూమెంట్, ది బాలూచ్ రిపబ్లికన్ పార్టీ, ది భాలూచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యూకే, ది బాలూచ్ స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్ తదితర సంఘాలు పాల్గొన్నాయి.