: ఔషధాలకు లొంగని క్యాన్సర్‌కు చికిత్స విధానాన్ని కనుగొన్న 16 ఏళ్ల భారత సంతతి బాలుడు!
బ్రిటన్‌లోని ఓ భారత సంతతి బాలుడు అద్భుత విజయం సాధించాడు. 16 ఏళ్ల వయసులోనే రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స విధానాన్ని కనుగొన్నాడు. మందులకు లొంగని ఈ వ్యాధిపై చిన్న వయసులోనే పరిశోధన చేసి అద్భుత ఆవిష్కరణ చేశాడు. కృతిన్ నిత్యానందం అనే బాలుడు రొమ్ము క్యాన్సర్లలో ఔషధాలకు కూడా తగ్గని ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌కు చికిత్స విధానాన్ని ఆవిష్కరించాడు. కణితులపై ఎలాంటి గ్రాహకాలు ఉండని ఈ వ్యాధికి శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలను కలిపి తీసుకున్నా అంతగా ఫలితం కనిపించదు. అలాంటి వ్యాధి ఔషధాలకు స్పందింపజేసే విధానాన్ని కనుగొన్నాడు. తన ఆవిష్కరణపై కృతిన్ నిత్యానందం మాట్లాడుతూ... ఇటువంటి క్యాన్సర్లు ఔషధాలకు ప్రభావితమై తగ్గిపోయే విధానంపై తాను దృష్టి పెట్టినట్లు చెప్పాడు. తాను పరిశోధన చేసిన క్యాన్సర్ కణితులపై గ్రాహకాలు కనబడవని పేర్కొన్నాడు. ఈ కారణంగానే ఆ క్యాన్సర్‌ను ఔషధాలు నియంత్రించలేవని అన్నాడు. ఐడీ4గా పిలిచే ఓ ప్రొటీన్ ఈ క్యాన్సర్ కణాలను ఔషధాలకు నియంత్రణ కాకుండా చేస్తుందని చెప్పాడు. ఒకవేళ ఈ ప్రొటీన్‌ను నియంత్రించ గలిగితే ఔషధాలు పనిచేస్తాయని పేర్కొన్నాడు. తాను ఈ ప్రొటీన్‌ను ఉత్పత్తిచేసే జన్యువులను కట్టిడిచేసే విధానాన్ని ఆవిష్కృతం చేసినట్లు తెలిపాడు.