: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద హైటెన్షన్!...టీ టీడీపీ ర్యాలీని భగ్నం చేసేందుకు ఖాకీల మోహరింపు!
సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర సర్కారుతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని నిరసిస్తూ టీ టీడీపీ మరికాసేపట్లో ఆందోళనకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా మరికాసేపట్లో హైదరాబాదు, ఎర్రమంజిల్ లోని జలసౌధను ముట్టడించేందుకు టీ టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలివెళ్లనున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకుంటున్నాయి. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అనుమతి లేకుండా ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమ ఆదేశాలను పాటిస్తే సరి... లేదంటే టీ టీడీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు కూడా వెనుకాడేది లేదన్న కోణంలో పోలీసులు సిద్ధమయ్యారు. వెరసి మరికాసేపట్లో అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొనే అవకాశాలున్నాయి.