: హింగిస్ లేకున్నా ఆగని సానియా జోరు... కనెక్టికట్ టైటిల్ కైవసం
స్విస్ టెన్నిస్ స్టార్ మార్టినా హింగిస్ తో విడిపోయిన తరువాత కూడా సానియా మీర్జా సత్తా చాటింది. యూఎస్ ఓపెన్ కు సన్నాహకంగా భావించే కనెక్టికట్ ఓపెన్ టోర్నీలో రొమేనియాకు చెందిన మోనికా నికులెస్కూ తో కలసి జోడీ కట్టిన సానియా టైటిల్ గెలుచుకుని కాన్ఫిడెన్స్ ను పెంచుకుంది. వీరిద్దరూ జట్టుగా ఆడిన తొలి టోర్నమెంట్ లోనే విజయం సాధించడం గమనార్హం. ఫైనల్ పోరులో ఉక్రెయిన్, తైవాన్ జంట కెత్రినా బొండారెంకో, చువాంగ్ చియా-జుంగ్ లపై వీరు 7-5, 6-4 తేడాతో గంటన్నర వ్యవధిలో విజయం సాంధించారు. కాగా, 2010లోనూ నికులెస్కూతో కలసి సానియా మీర్జా మహిళల డబుల్స్ ఆడింది. అప్పట్లో వెస్ట్రన్ ఓపెన్, సదరన్ ఓపెన్ పోటీల్లో తలపడ్డ ఈ జంట క్వార్టర్ ఫైనల్స్ వరకూ మాత్రమే చేరుకుంది.