: పఠాన్ కోట్ దాడి పాక్ పనే!... తేల్చేసిన అమెరికా!
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్ర దాడి పాకిస్థాన్ పనేనని మరోమారు తేలిపోయింది. ఈ దాడి సూత్రధారులు పాక్ కు చెందిన వారేనన్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాదన సరైనదేనని అగ్రరాజ్యం అమెరికా నిగ్గు తేల్చింది. ఈ మేరకు ఎన్ఐఏ అందించిన సమాచారాన్ని పరీక్షించిన అమెరికా ఓ నివేదికను భారత్ కు అందజేసింది. పఠాన్ కోట్ దాడికి సూత్రధారులుగా వ్యవహరించిన వారు పాక్ భూభాగంలోనే ఉన్నారని అమెరికా సదరు నివేదికలో తేల్చి చెప్పింది. జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతలు పఠాన్ కోట్ దాడికి ప్రణాళిక రచించారని ఆ నివేదికలో అమెరికా పేర్కొంది. సదరు వ్యక్తుల ఫేస్ బుక్ ఐపీ అడ్రెస్ లు పాక్ లోని కరాచీలోనే ఉన్నాయని తెలిపింది. ఇక దాడి సందర్భంగా ఉగ్రవాదులు వినియోగించారని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్న మొబైల్ నెంబర్ ను అంతకుముందు జైషే నేత ఖషీప్ జాన్ వాడాడని కూడా అమెరికా నిగ్గు తేల్చింది.