: పాకిస్థాన్ తో యుద్ధం చేసే ఆలోచనలో మోదీ: మాయావతి సంచలన ఆరోపణ
ప్రధాని నరేంద్ర మోదీ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు పాకిస్థాన్ తో యుద్ధానికి దిగాలని భావిస్తున్నారని బహుజన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ మాయావతి సంచలన ఆరోపణలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ నియోజకవర్గం అజామ్ గఢ్ లో పర్యటించిన ఆమె, రోడ్ షోలో ప్రసంగిస్తూ, మోదీపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలు బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని, యూపీ ఎన్నికలకు ముందు హిందూ - ముస్లిం వర్గాల మధ్య గొడవలు పెట్టే పార్టీలు సమయం కోసం వేచి చూస్తున్నాయని ఆరోపించారు. వచ్చే సంవత్సరం యూపీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆమె ప్రసంగం యావత్తూ, బీజేపీ, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న ఎస్పీ పార్టీలను దుమ్మెత్తి పోసేందుకే సరిపోయింది. తన సొంత ప్రాంతాలైన ఎత్వాహ్, సయిఫాయ్ గ్రామాల్లాగా అభివృద్ధి చేస్తానని ములాయం ఇచ్చిన తప్పుడు హామీని నమ్మి ఆజాంగఢ్ ప్రజలు మోసపోయారని, మరోసారి ఆయన బుట్టలో పడవద్దని అన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరుగుతున్నాయని, అందుకు బీజేపీయే కారణమంటూ, రోహిత్ వేముల, ఉనా, దయాశంకర్ సింగ్ ఉదంతాలను మాయావతి ప్రస్తావించారు. తన పార్టీ అగ్రవర్ణాలకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని, 'సర్వజన్ హితాయ, సర్వజన్ సుఖాయ' నినాదంతో ముందుకు సాగుతామని తెలిపారు.