: విధి నిర్వహణలో ‘ఖాకీ’లు అలసిపోతున్నారట!.. సర్వేలో వెలుగు చూసిన వాస్తవం
అవును.. విధినిర్వహణలో ఉన్న పోలీసుల్లో దాదాపు 92 శాతం మంది అలసిపోతున్నారని ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(బీపీఆర్డీ) నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ఇన్స్పెక్టర్ స్థాయి కంటే కింద ఉండే పోలీసుల్లో ఇది చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. వేళాపాళా లేని పని గంటలు, డ్యూటీ సమయం పొడిగింపు, అత్యవసర సేవల కోసం ఒక్కసారిగా వెళ్లాల్సి రావడం, సరిపడా నిద్రలేకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం, పై అధికారుల ప్రవర్తన, ధూమపానం, మద్యం తీసుకోవడం తదితర కారణాలతో వారు శారీరక, మానసిక అలసటకు గురవుతున్నట్టు సర్వే వివరించింది. చాలామంది పోలీసులు సహనం కోల్పోవడానికి వారి మానసిక, శారీరక అలసటే కారణమట. అంతేకాదు, ఈ కారణంగా వారు సరైన నిర్ణయాలు సైతం తీసుకోలేకపోతున్నారని తెలిపింది. దాదాపు 91.79 శాతం మంది పోలీసులు అలసట బారిన పడుతున్నారని సర్వే తేల్చింది.